సందేహాలుంటాయా చెలి……

అవునంటే కాదంటావు
కాదంటే అవునంటావు
ఏదన్నా తప్పంటావు
చెలి నీకింక చెప్పెదెలా

దగ్గరగా రానంటావు
దూరాలే దారంటావు
ఏదైనా గొడవంటావు
చెలి నీతోటి నెగ్గెదెలా

కన్నులతో చూసిందంతా
జరిగేది కాదు
మాటలుగా విన్నదంతా
జరిగింది కాదు
చెప్పలేని, చెప్పుకోని సంగతులన్నీ
మనసెట్టి ఆలోచిస్తే
సందేహాలుంటాయా చెలి……

Posted in Uncategorized | Leave a comment

.. నన్నే మరిచేపోయా

నాలా తననే చూసా
తననే తనగా చూసా
తనగా నన్నే చూసా
నన్నే తనలో చూసా
ఇలా చూస్తూ చూస్తూ
తనలా నేనైపోయా
నన్నే మరిచేపోయా

Posted in Uncategorized | Leave a comment

….ఎందుకు ఎందుకు ఈ యుద్ధం….

భూముల కోసం పోరాటం
ఆదిపత్యపు ఆరాటం
ఫలితం లేని కల్లోలం
ఎన్నాళ్ళింకా ఈ పంతం

కాల్పుల వలయంతో
తూటాల ప్రవాహంతో
ఏ శాంతిని నిలిపేది
అశాంతితో నిండిన దారుల్లో

రక్తపు మరకల్లో
రాక్షసత్వపు ముసుగుల్లో
ఏ గమ్యం వెతికేది
మరణాలతో నిండిన గమనంలో

ఎందుకు ఎందుకు ఈ యుద్ధం
చేయని తప్పుల పెనుభారం
మొదలెడితే ఆగని నరమెధం
చీకటిగా మారెను మనలోకం

రేపటి కోసం వెతుకు
ఘర్షణలే ఎందుకు మనకు
ఆ రేపటి వేటలలో
ఏ ఒక్కడు మిగలడుగా

ప్రేమల కోసం బతుకు
కక్షలతో తిరగకు మలుపు
ఆ కక్షల వంతెనలో
ఏ ప్రాణం మిగలదుగా

Posted in Uncategorized | Leave a comment

……నను నేనే

తన రెప్పల అలికిడిలో
చూసా నను నేనే
తన చూపుల గారడీలో
మరిచా నను నేనే
తన తలపుల అలజడిలో
కలిసా నను నేనే
తన రేపటి స౦దడిలో
వెతికా నను నేనే
తన అడుగుల వెంబడిగా
తరిమా నను నేనే
తన గెలుపుల ఒరవడిలో
గెలిచా నను నేనే

నన్నే నాకే చేస్తోంది పరిచయం
ఇలా తనతో గడిపే ప్రతిక్షణం

Posted in Uncategorized | Leave a comment

నా జీవిత తాత్పర్యం

అనురాగం నాలో విరిసే ఉషా కిరణం
ఆరాటం నాలో ఎగసే సంధ్యా కెరటం
మదనం నాలో జరిగే అంతర్మఖ పోరాటం
వదనం నాలో కరిగే భావాల శూన్యం

పయనం నాలో స్వేచ్ఛా విహంగాల పవనం
జీవితం నాలో సాగే తరంగాల సాగరం
ఏకాంతం నాలో ఆలోచనల సంగ్రామం
ఆశాంతం నాలో నాకే ప్రశ్నల సమరం

వేదం నాలో నమ్మిన జీవిత విధానం
నివేదం నాలో అంతా పరమాత్మకు నిత్యం

Posted in Uncategorized | Leave a comment

కోపాలు తాపాలు…..

చీకటి వెలుగుల నిశీధితో
నిన్నటి జిలుగుల సమాధిలో
ఎన్నాళ్ళు బతికేది
రేపెపుడు చూసేది

నిజాలు తెలియని తీర్పులతో
వెతికిన జరగని మార్పులలో
ఎన్నాళ్ళు వేచేది
అడుగెపుడు కదిలేది

చెదిరిన మనసుల దీపాలతో
ముదిరిన అలకల లోపాలలో
ఎన్నాళ్ళు నడిచేది
దారెపుడు మలిచేది

కోపాలు తాపాలు
అలిసేది ఎపుడిక
దూరాల మనసుల్ని
కలిపేది ఎపుడిక
నేరాల లెక్కలని
మరిచేది ఎపుడిక
మారాలు కడతేర్చి
మాట్లాడాలి ఇపుడిక

Posted in Uncategorized | Leave a comment

గట్టు విడిచిన కంటిప్రవాహం….

నిరాశ నీడలు అలుముకుంటే
నిట్టూర్పు జాడలు వదలనంటే
నిందల చీకట్లు కమ్ముకుంటే
వందల ఇక్కట్లు తరుముతుంటే

నిజాలు నిశిగా మారుతుంటే
భుజాలు అండగా నిలవకుంటే

కష్టాల సంకెల బిగుసుకుంటే
నష్టాల అంకెలు పెరుగుతుంటే
వ్యధతో ఎదలు పొంగుతుంటే
బాధతో దిగులు పెరుగుతుంటే

పట్టు సడలిన ఆత్మవిశ్వాసానికి
గట్టు విడిచిన కంటిప్రవాహం
ఎగసిన కెరటమై
చెంపను తాకదా
విశ్వాసాన్ని నింపదా
పట్టుదలను నేర్పదా
గమ్యానికి చేర్చదా….

Posted in Uncategorized | Leave a comment